ఒడిశా మీద కన్నేసిన చంద్రబాబు: 52 అసెంబ్లీ స్థానాల్లో పోటీ!

Saturday, December 8, 2018 11:03 PM Politics
ఒడిశా మీద కన్నేసిన చంద్రబాబు: 52 అసెంబ్లీ స్థానాల్లో పోటీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక మహాకూటమిని ఏర్పాటు చేయాలని ఎన్డీయేతర పార్టీలతో చేతులు కలుపుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీ పార్టీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎలక్షన్‌లలో కాగ్రెస్ మరియు ఇతర పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఇప్పుడు ఆ పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రం మీద కన్నేశారు.

2019లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా రాష్ట్రంలో కూడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఒడిశాలో ఉన్న 52 అసెంబ్లీ స్థానాలతో పాటు 5 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న తెలుగు జనాభా ఈసారి టీడీపీకే పట్టం కట్టబోతోందని ఒడిశా టీడీపీ చీఫ్ రాజేశ్ పుత్ర పేర్కొన్నారు.

ఒడిశాలోని తెలుగు రాష్ట్రాల సరిహద్దు గల కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజేశ్ తెలిపారు. అదే విధంగా కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్ సభ స్థానాలను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందని, పోటీ చేసే మరో స్థానాన్ని ఎంపిక చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఒడిశాలో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులను తేదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎంపిక చేసి, అతి త్వరలో ఆయనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజేశ్ తెలిపారు.