స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక..!

Thursday, June 13, 2019 03:00 PM Politics
స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక..!

ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ స్పీకర్‌గా వైసీపీ ఎమ్మెల్యే త‌మ్మినేని సీతారాం ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. స్పీక‌ర్‌ ఎన్నికకు ప్రొటెం స్పీకర్‌ చినవెంకట అప్పలనాయుడు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.  స్పీకర్‌గా ఇప్పటికే తమ్మినేని సీతారాం పేరును ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌ పదవికి తమ్మినేని సీతారాం నామినేష్‌ దాఖలు చేయటం జరిగింది. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు పలికారు. ఒకే ఒక నామినేష‌న్ దాఖ‌లు కావ‌డంతో  ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు స్పీకర్ని అధికారికంగా ప్రొటెం స్పీక‌ర్ ప్ర‌క‌టిస్తారు.  స్పీకర్‌గా తమ్మినేని గురువారం అధికారికంగా భాధ్యతలు చేపట్టనున్నారు. త‌మ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.

తమ్మినేని సీతారాం ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించిన సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1983లో మొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 1989లో ఓటమి చవిచూశారు. ఆ తరువాత 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. చంద్రబాబు హయాంలో 9 ఏళ్ల పాటు మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. 2004లో టీడీపీ ప్రభుత్వం పడిపోయాక చంద్రబాబు నాయుడుతో విబేధాలు రావడంతో పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్‌ మరణం తరువాత తమ్మినేని సీతారాం వైసీపీలో చేరారు. 2014లో ఫ్యాన్‌ గుర్తుపై పోటీ చేసి మరో అపజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. 2019లో వైసీపీ నుంచి తన మేనల్లుడు కూన రవికుమార్‌పై 14వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.   

For All Tech Queries Please Click Here..!