వైసీపీ ఎమ్మెల్యే ధర్నా, జగన్ హామీతో ముగిసిన ధర్నా..!

Tuesday, June 11, 2019 03:34 PM Politics
వైసీపీ ఎమ్మెల్యే ధర్నా, జగన్ హామీతో ముగిసిన ధర్నా..!

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆందోళనల జోలికి వెళ్ళటం చాలా అరుదు ఎందుకంటె అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వం కాబట్టి. ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ నిరసనలు తెలుపుతూ ఉంటాయి. కానీ ఏపీలో టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితిలో లేదు. అధికార పార్టీ అయినా ఓ ఎమ్మెల్యే రైతుల సమస్యలు తీర్చాలని ధర్నా చేపట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాలలోకి వెళితే అధికార వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రైతులతో కలిసి ధర్నాకు దిగారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్ట్‌ వద్ద గత ప్రభుతం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేనువు ప్రాజెక్టుకు నీరు తరలించేలా గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, దీంతో రాళ్ళపాడు ప్రాజెక్ట్ కింద ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యలు ఎక్కువ కావటం తో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. సమాచారం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి రైతుల న్యాయమైన డిమాండ్ కు తన మద్దతు పలికి ఆయన కూడా రైతులతో పాటు ధర్నాకు దిగారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే తమకు మద్దతుగా నిలవటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే ధర్నాకు దిగారంటూ వార్తలు రావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అసలు విషయం ఏమిటంటూ ఆరా తీసి సీఎం జగన్ దృష్టికి రాళ్ళ పాడు ప్రాజెక్ట్ ఇష్యూ తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీరు తీసుకెళ్లే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం జగన్ అనంతరం జీవోను రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ధర్నా విరమించారు. అధికార పక్షంలో ఉండి, ధర్నా చేసి రైతుల సమస్యను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్ళినందుకు రైతులు సంతోషం వ్యక్తం చేసారు.

For All Tech Queries Please Click Here..!