ప్రజావేదిక కూల్చివేత ఆపుటకు హైకోర్టు నిరాకరణ..!

Wednesday, June 26, 2019 11:40 AM Politics
ప్రజావేదిక కూల్చివేత ఆపుటకు హైకోర్టు నిరాకరణ..!

కృష్ణా నది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసానికి ఆనుకుని నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని అభ్యర్థిస్తూ దాఖలయిన పిటీషన్ పైన హైకోర్టు తీర్పు వెలువడించింది. అడ్వొకేట్‌ జనరల్‌ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ప్రజావేదిక కూల్చివేత ఆపడానికి నిరాకరించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని దాఖలయిన వ్యాజ్యంపై మంగళవారం అర్థరాత్రి 2.30 అప్పుడు హైకోర్టు జడ్జిల ఎదుట విచారణ కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. ఇందులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి హాజరయ్యారు.

వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి.శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రజావేదిక కూల్చడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అవుతుందని అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నాకే ముందుకెళ్లాలని. ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చించాలని కోరారు. ఏకపక్షంగా ప్రజావేదిక కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రూ.9కోట్ల ప్రజాధనంతో ప్రభుత్వంలో ఓశాఖ నిర్మించిన ప్రజావేదికను మరో శాఖ అక్రమమని భావిస్తే వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టుని కోరగా ఆ అభ్యర్థనను ఆయన ఏసీజే దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఏసీజే పై ఇరువురు జడ్జిల ముందు విచారణకు వచ్చేలా చూడాలని ఆదేశించారు.

For All Tech Queries Please Click Here..!