బీజేపీ కొత్త పలుకులు.. సుజనా, సిఎం రమేష్‌లపై కేసుల్లేవు..!

Monday, June 24, 2019 10:22 AM Politics
బీజేపీ కొత్త పలుకులు..  సుజనా, సిఎం రమేష్‌లపై కేసుల్లేవు..!

ఇటీవల టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్‌ తదితరులపై ఆర్థికపరంగా ఎటువంటి కేసులు లేవని, వారిపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. చట్టబద్దంగానే ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో విలీనం అయ్యారన్నారు. గతంలో ఎన్నో సార్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన టిడిపి, కాంగ్రెస్‌లకు ఈ విషయంలో బీజేపీని విమర్శించే హక్కు లేదని అన్నారు. ఆదివారం బిజెపి ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసారు. బిజెపిలోకి వచ్చిన నలుగురు ఎంపిలపై ఆరోపణలే తప్ప చార్జిషీట్లు, కేసులు లేవని వివరించారు. ఈ విషయంలో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే రాజ్యసభలో పదహారు సార్లు విలీనాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఆనాడు ప్రజాప్రతిధులు తమ పార్టీలోకి చేర్చు కోవడమే కాకుండా వారికి రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు కూడా ఇచ్చిన టిడిపి, కాంగ్రెస్‌లు ప్రస్తుతం విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టాలకు లోబడే నలుగురు రాజ్యసభ సభ్యులు చేరారని అన్నారు. ఈ నలుగురిపై ఎక్కడా కేసులు లేవని, చార్జిషీట్‌లు నమోదు కాలేదని అన్నారు. అయితే, ప్రస్తుతం వారిపై ఉన్న ఆరోపణలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

For All Tech Queries Please Click Here..!