రాత్రివేళ వలంటీర్ల మెరుపు ధర్నా..!

Friday, March 27, 2020 08:49 AM Politics
రాత్రివేళ వలంటీర్ల మెరుపు ధర్నా..!

రాష్ట్రంలో కరోనా వైరస్‌ క్రమంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అనుమానితులను వెదికి పట్టుకోవడం, వారి జాడలను కనుగొనడంలో గ్రామ, వార్డు వలంటీర్లు ఏ స్థాయిలో విధులను నిర్వర్తిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. లాక్‌డౌన్ అప్రకటిత కర్ఫ్యూ సమయంలో కూడా వారు ఇంటింటికీ వెళ్లి కరోనా వైరస్ అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచీ గానీ, పొరుగు రాష్ట్రాల నుంచి గానీ కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు.

వలంటీర్ల ద్వారా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మారుమూల గ్రామం నుంచి సైతం డేటా తెచ్చుకోగలుగుతోంది ఏపీ ప్రభుత్వం. అలాంటి వలంటీర్లకు కూాడా లాఠీ దెబ్బలు తప్పట్లేదు. విధి నిర్వహణలో పోలీసుల జులుంను ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఇంటింటికీ వెళ్లి హెల్త్ సర్వే నిర్వహిస్తోన్న తమపై పోలీసులు లాఠీఛార్జీ చేశారని కొందరు వలంటీర్లు ఆరోపిస్తున్నారు. తాము వలంటీర్లమని, విధుల్లో ఉన్నామని చెబుతున్నప్పటికీ.. వినిపించుకోలేదని, లాఠీ దెబ్బలను రుచి చూపించారని విమర్శిస్తున్నారు. దీనికి నిరసనగా వలంటీర్లు రాత్రివేళ మెరుపు ధర్నాకు దిగారు. రాజమహేంద్రవరంలోని 6,7,8 వార్డుల గ్రామ సచివాలయ భవన సముదాయం వద్ద ధర్నాకు దిగారు.

For All Tech Queries Please Click Here..!
Topics: