ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, 560 కోట్లతో వైయస్సార్ 'కంటి వెలుగు' స్కీమ్

Sunday, October 13, 2019 03:00 PM News
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, 560 కోట్లతో వైయస్సార్ 'కంటి వెలుగు' స్కీమ్

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం వైయస్ జగన్ ( Ap Cm YS Jagan)ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతీ ఒక్కరికీ చక్కటి కంటిచూపు ఉండాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ కంటి వెలుగు స్కీమును తీసుకురానున్నారు. అక్టోబర్ 10 నుంచి వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నవరత్నాల అమలుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( Ysrcp)ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీటి అమలుకోసం అసెంబ్లీలో ఇప్పటికే పలు కీలక బిల్లులను ఆమోదింపజేసింది. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. దృష్టి లోపం ఉన్న వారికి కళ్లద్దాలను అందజేయడమే గాక అవసరమైన వారికి ప్రభుత్వమే ఆపరేషన్లను చేయిస్తుంది. ఈ స్కీములో భాగంగా కంటి వైద్యులు నేరుగా గ్రామాలకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. డాక్టర్ వైఎస్సార్‌ కంటి వెలుగు (YSR kanti Velugu)కార్యక్రమం కోసం ప్రభుత్వం ఓ సాంకేతిక కమిటీని ఏర్పాటుచేసింది. 104 సంచార వైద్యశాలల మాదిరిగా గ్రామాలకు వెళ్లి అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్‌ హైమావతి నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈమె నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పర్యవేక్షించే అధికారులను సభ్యులుగా నియమించారు. ఈ కార్యక్రమం అమలు, ఇతర అంశాలపై అధ్యయనం కోసం ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ ఛైర్మన్‌గా 12 మందితో మరో కమిటీని ఏర్పాటుచేశారు.

రూ. 560 కోట్లతో పథకం అమలు

స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్ ఈ సమావేశంలోనే వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రస్తావించారు. రూ. 560 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని ఈ కార్యక్రమంలో తెలిపారు. తొలి విడతలో అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షల నిర్వహించనున్నారు. రెండో విడతలో నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు అవసరమైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను నిర్వహించనుంది.

రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ

వైయస్సార్ కంటివెలుగు కార్యక్రమం ద్వారా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి, ప్రాంతీయ, సర్వజన ఆసుపత్రుల వరకూ నేత్ర చికిత్సలను పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారు. అత్యాధునిక యంత్రాలతో కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిదోషాలు ఉన్నవారికి తగిన వైద్యం అందించడం, కంటిచూపులోపం ఉందని గుర్తించిన వారికి కళ్లజోళ్లు అందజేయడం వంటి కార్యక్రమాలు ఈ పథకం కింద చేపడతారు. శుక్లాలు, ఇతర సమస్యలకు ఆధునిక చికిత్సలు కూడా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేసింది. డిసెంబర్‌ 21 నుంచి ప్రతి కుటుంబానికీ క్యూ ఆర్‌ కోడ్‌తో హెల్త్ కార్డులు జారీ చేయాలని ఏపీ సీఎం నిర్ణయించారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేయాలని జగన్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. 2 వేలకుపైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయాలని తెలిపారు. జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేయాలని చెప్పారు. జూన్‌ 2022 నాటికి మొత్తం ఆస్పత్రులన్నీ పూర్తిగా మెరుగుపడాలని సూచించారు. కడప, విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో కేన్సర్‌ ఆస్పత్రులు, శ్రీకాకుళం , ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ రీసెర్చ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లో 150 ఆస్పత్రుల్లో అందుబాటులోకి ఆరోగ్యశ్రీ

మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో 150 ఆస్పత్రుల్లో అందుబాటులో తేనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలలో 150 ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నట్లు జగన్ స్పష్టం చేశారు. ఇకపోతే 108, 104 వాహనాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఆరేళ్లకోసారి వాహనాలను మార్చాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ ఆదేశించారు.

దివంగతవైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినికిడి సమస్యతో బాధపడే ఎందరో చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు చేసి వారి జీవితాల్లో సంతోషాలు నింపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరో గుండెజబ్బులు, తీవ్రమైన వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు అందించారు. ఆ తండ్రి బాటలోనే సాగుతున్న వైయస్ జగన్ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో పెరుగుతున్న కంటి సమస్యలకు పరిష్కారంగా వైయస్సార్ కంటివెలుగు పథకాన్ని ప్రారంభించారు. కాగా, కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పేరిట కొత్త పథకానికి గతేడాది ఆగస్టు 15న శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

For All Tech Queries Please Click Here..!