విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించండి : బ్రిటన్ కోర్టు!

Monday, December 10, 2018 10:53 PM News
విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించండి : బ్రిటన్ కోర్టు!

విభిన్నమైన జీవన మరియు వ్యాపార శైలితో అత్యంత పాపులారిటీ దక్కించుకున్న విజయ్ మాల్యా... భారతదేశపు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దాని అనుబంధ బ్యాంకులకు సుమారుగా 9 వేల కోట్ల రుపాయలను మోసం చేసి రహస్యంగా దేశం విడిచి పారిపోయాడు. విజయ్ మాల్యా బ్యాంకులను మోసం చేసిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం మరియు బ్యాంకుల మీద దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. 

ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా అనూహ్యంగా ట్విట్టర్ ద్వారా నేను బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించేస్తాను... భారత్‌కొచ్చేందుకు సిద్దంగా ఉన్నానని పలు పోస్టులు చేశారు. అంతే కాకుండా, తన మీద ఉన్న ఆరోపణలు కొట్టేసి, తనపై ఉన్న మోసగాడు అనే ముద్రను చెరిపేయాలని వేడుకున్నాడు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు మాల్యాను ఇండియాకు అప్పగించాలని నేడు తీర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతించిన సీబీఐ అందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మాల్యా కోసం ముంబాయ్‌లో ఓ ప్రత్యేక జైలును కూడా ఏర్పాటు చేసింది. అయితే, వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు విజయ్ మాల్యాకు మరో 14 రోజులు గడువు ఇచ్చింది.