2018లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాప్-10 వార్తలు

Saturday, December 29, 2018 12:23 PM News
2018లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాప్-10 వార్తలు

కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది, 2018 ఏడాది కొందరికి మంచిని తీసుకొస్తే... మరెందరికో బాధలను మిగిల్చింది... తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంఘటనలు సంచలనం సృష్టించాయి. అందులో టాప్-10 వార్తలు మీ కోసం...

alt text
శ్రీదేవి మరణం: దివికేగిన అందాల తార...
ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఒక వివాహానికి వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో మరణించారు. ఊహించని ఈ వార్త యావత్ దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ బాషలతో పాటు మరెన్నో ప్రాంతీయ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అతిలోక సుందరితో తెలుగు ప్రేక్షకులది విడదీయరాని బంధం. అప్పట్లో ఈ వార్త ఎన్నో అనుమానాలకు తెరలేపింది. శ్రీదేవి మరణం ఒక మిస్టరీని తలపించింది. అయితే, శ్రీదేవి మరణం గుండెపోటుతో సంభవించిందని దుబాయ్ డాక్టర్లు పోస్ట్‌మార్టంలో వెల్లడైంది.

alt text
హరికృష్ణ దుర్మరణం
2018లో నందమూరి హరికృష్ణ ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హరికృష్ణ మృతి నందమూరి కుటుంబంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో కలిచి వేసింది. సీనియర్ ఎన్టీర్ రాజకీయ ఆరగేట్రం చేసిన కాలంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన హరికృష్ణ పలు చిత్రాల్లో నటించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మరియు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆగష్టు నెలలో హైదరాబాద్ నుండి నెల్లూరులోని స్నేహితుని కుమారుడి వివాహానికి వెళుతున్నపుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో మరణించాడు.

alt text
మిర్యాలగూడ పరువు హత్య
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన ఓ పరువు హత్య తీవ్ర సంచలనం రేపింది. కూతురు కులం తక్కువ వ్యక్తిని ప్రేమించిందనే ఆక్రోశంతో కిరాయి హంతకుల చేతి అతడిని అతి దారుణంగా చంపించిన ఓ తండ్రి ఉదంతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రణయ్-అమృతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ప్రణయ్ తన భార్యను ప్రెగ్నెన్సీ పరీక్షల తరువాత ఇంటికి తీసుకెళుతుండగా ఆసుపత్రి బయట అమృత తండ్రి పురమాయించిన కిరాయి హంతకులు ప్రణయ్ మీద వేట కొడవలితో దాడి చేసి అక్కడిక్కడే చంపేశారు. పరువు హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమృత తండ్రి మారుతీ రావును ఏ1 మరియు బాబాయ్ శ్రవణ్‌ను ఏ2 ముద్దాయిగా చేర్చారు.

alt textకొండగట్టు బస్సు ప్రమాదం
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కొండగట్టు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం సుమారుగా 62 మంది ప్రయాణికుల ప్రాణాల్ని బలిగొంది. ఆర్టీసీ బస్సు ప్రమాదాలలోకెల్లా అతి పెద్ద ప్రమాదం ఇదే. కొండగట్టు నుండి క్రిందకు వస్తున్న బస్సు స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపు తప్పి సుమారుగా 100 కిమీల వేగంతో లోయలోకి దూసుకెళ్లింది, సరిగ్గా అదే సమయంలో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో డ్రైవర్ ప్రమాదాన్ని అధిగమించలేకపోయారు. ఫిట్‌నెస్ లేకపోవడం మరియు ఓవర్ లోడ్ ప్రమాదానికి గల ప్రదాన కారణాలని అధికారులు తేల్చారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం ఓ ఊరినే వల్లకాడుగా మార్చింది... మరెన్నో కుంటుంబాల్లో తీరని వేదాన్ని మిగిల్చింది.

alt text
తెలంగాణ అసెంబ్లీ రద్దు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన అనంతరం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి  కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం తమ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మంత్రివర్గ సమావేశంలో కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. అసెంబ్లీ రద్దుకు సంభందించిన పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ సమక్షంలో గవర్నర్ నరసింహన్‌కు అందజేసి తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

alt text
టీడీపీ శ్రేణులను కాల్చి చంపిన మావోయిస్టులు
2018లో అరకులోయ టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు మరియు మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు చంపేశారు. అరకు నియోజకవర్గంలోని డింబ్రిగూడ మండలంలో గల లిపిటిపుట్ట వద్ద ఎమ్మెల్యే వాహనాలను అడ్డగించిన మావోయిస్టు బృందం కిడారి మరియు సివేరిలను అడవిలోకి ఈడ్చుకెళ్లి, వారి మీద నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అత్యంత దారుణంగా హతమార్చారు. మావోయిస్టుల మెరుపుదాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి.

alt text
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత మరియు వైకాపా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైజాగ్ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగింది. సెల్ఫీ సాకుతో దగ్గరి వచ్చిన నిందితుడు కోడి పందేలలో ఉపయోగించే పదునైన కత్తితో దాడికి తెగబడ్డాడు. ఏపీ ప్రతిపక్ష నేతపై జరిగిన ఈ దాడి తీవ్ర దుమారం రేపింది.

alt text
తిత్లీ తుఫాన్ బీభత్సం
2018 అక్టోబర్ నెలలో సంభవించిన తిత్లీ తుఫాన్ దక్షిణ కోస్తాను అతలాకుతలం చేసింది. వేల ఎకరాల్లో పంట నష్టం, కొబ్బరి తోటలతో పాటు మరెన్నో పండ్ల తోటలను నాశనం చేసింది. ఒక్క శ్రీకాకుళంలో జిల్లాలోనే కొన్ని వేల కోట్లు నష్టం సంభవించింది. తిత్లీ తుఫాన్ దాటికి సుమారుగా 8 మందికి పైగా మరణించారు.

alt text
తెలంగాణ ఎన్నికల: టీఆర్ఎస్ ప్రభంజనం... ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
2018 తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.  మునుపెన్నడూ లేని విధంగా సుమారుగా 90కి పెగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. దీంతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, తెలంగాణ తెలుగు దేశం పార్టీ మరియు తెలంగాణ జనసమితి పార్టీల సమక్షంలో ఏర్పాటైన ప్రజా ఫ్రంట్‌ను ధీటుగా ఎదుర్కొని టీఆర్ఎస్ అత్యధి సీట్లు సాధించడం దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. 

alt text
పెథాయ్ దుమారం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మీద పంజా విసిరింది. పెథాయ్ తుఫాన్ కారణంగా డిసెంబరు నెలలో చలితీవ్రత సాధారణం కంటే చాలా దారుణంగా పడిపోయింది. దీంతో పెథాయ్ కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాలతో పాటు తెలంగాణ మరియు ఒడిశాలలో చలి కారణంగా ఎంతో మంది మరణించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 30 మందికి పైగా మృత్యువాతపడ్డారు.