అలుపెరగని యోధుడి ప్రస్థానం

Wednesday, June 12, 2019 12:30 PM News
అలుపెరగని యోధుడి ప్రస్థానం

చరిత్ర పుటలను ఓ సారి తిరగేస్తే జగన్ ప్రస్థానమంతా ముళ్ళబాటే, ఈ స్థాయికి రావడానికి ఇప్పటి విజయానికి పదేళ్ళ పాటు కష్టాలు, కన్నీళ్ళు తోడుగా నిలిచాయి. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, వేధింపులు, జైలు జీవితం, కుటుంబ సభ్యులపై చౌకబారు విమర్శలు ఇలా అన్నింటీని ఎదుర్కొన్నాడు. ప్రతి సమస్యకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. కేవలం ఇద్దరు ప్రజాప్రతినిధులతో స్థాపించిన పార్టీని అలుపెరగని ప్రజా పోరాటాలతో అఖండ మెజార్టీతో అధికారంలోకి తేవడం వైఎస్‌ జగన్‌కే సాధ్యమైందని నిస్సందేహంగా చెప్పవచ్చు. నమ్మిన ఆశయాల సాధన కోసం నాడు కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు వైఎస్‌ జగన్, విజయమ్మలు రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వచ్చారు. వారి రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో కడప ఎంపీగా ఎన్నికకాగా, వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల భారీ మెజార్టీతో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా 2011 మార్చి 12న జగన్‌ వైఎస్సార్‌సీపీని స్థాపించారు. అలా ఇద్దరు ప్రజాప్రతినిధులతో మొదలైన పార్టీ రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదిగింది. రైతుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌, ఇతర సమస్యలతో నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి నాయకుడంటే ఏంటో నిరూపించుకున్నారు.

మద్దతు ఇస్తే ఎమ్మెల్యే పదవులకు అనర్హులమవుతామని తెలిసినప్పటికీ జగన్‌పై విశ్వాసంతో 17 మంది ఎమ్మెల్యేలు నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వారిపై అనర్హత వేటు వేయడంతో 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 15 అసెంబ్లీ సీట్లతోపాటు నెల్లూరు ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై జగన్‌ ప్రజా పోరాటాలు చేశారు. జలదీక్ష, రైతు దీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష తదితర దీక్షలు, ధర్నాలతో ఉద్యమించారు. ఏనాడు ఎవరికీ బెదరలేదు అదరలేదు. చిరునవ్వే తోడుగా ముందుకు కదిలారు. 2014 ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన వైఎస్సార్‌సీపీ 67 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీ స్థానాల్లో నెగ్గి బలమైన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర పోషించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగులు కొత్తగా వేసినా అధికారపక్షంపై తిరుగులేని దాడి చేశాడు. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుపై పోరాటమంటే ఆషామాషి కాదు. అదరక బెదరక ఐదేళ్లపాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ వచ్చారు.

గత ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి నాటి సీఎం చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నా బెదరలేదు. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. పార్టీ ఫిరాయిస్తే పదవులకు రాజీనామా చేయాలన్న నిబంధనను పాటించలేదు. నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న విజ్ఞప్తిని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పట్టించుకోలేదు. ఈ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. మడమ తిప్పలేదు..మాటలో వాడి తగ్గలేదు. నేను విన్నాను.. నేను ఉన్నానంటూ పాదయాత్రతో ప్రతీ ఇంటి గడప తట్టాడు..దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాలనను తిరిగి తెస్తానని జనాల్లో నమ్మకాన్ని తెచ్చుకోవడంలో పూర్తి సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో ఒంటిచేత్తో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని సాధించిపెట్టిన వైఎస్‌ జగన్‌ దాదాపు 50 శాతం ఓట్లతో దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించారు. ఏకంగా 86 శాతం సీట్లను వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం విశేషం. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 151 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 25 ఎంపీ స్థానాల్లో 22 చోట్ల ఘన విజయం సాధించింది.

100కిపైగా అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో ఓ పార్టీ 86 శాతం సీట్లను గెలుచుకోవడం ఇదే తొలిసారి. గతంలో ఎన్టీఆర్‌ నేతృత్వంలో టీడీపీ 1994 ఎన్నికల్లో 68 శాతం సీట్లు గెలుచుకోవడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. దీన్ని బద్ధలుకొడుతూ వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఏకంగా 86 శాతం సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.. 10 ఏళ్ళ నుంచి నాయకుడిగా నిరూపించుకోవాలనే అతని ఆశకు ఊపిరివచ్చింది. మరి నాయకుడిగా నిరూపించుకుంటారా..లేక 
అందరిలాంటివాడిలా మిగిలిపోతారా అనేది అతని సామర్థ్యం, చేయాలన్న తపన దానికి తోడు కాలమే నిర్ణయిస్తాయి.

For All Tech Queries Please Click Here..!