బుధవారం ఒక్కరోజే భారీగా కేసులు, 127కు చేరిన కేసులు , 9కి చేరిన మరణాలు

Thursday, April 2, 2020 07:02 AM News
బుధవారం ఒక్కరోజే భారీగా కేసులు, 127కు చేరిన కేసులు , 9కి చేరిన మరణాలు

రాష్ట్రం నుంచి ఢిల్లీలోని మత ప్రచారానికి వెళ్లొచ్చినవారికి, వారివల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్‌ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది అని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి పాజిటివ్‌ అని వెల్లడైంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 127కి చేరింది. కరోనా కారణంగా బుధవారం గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ వైరస్‌ వల్ల మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. బుధవారం నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్‌ కు వెళ్లి వచ్చిన వారే. గతంలో మరణించిన ఆరుగురు కూడా మర్కజ్‌ కు వెళ్లి వచ్చినవారే అని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌ లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు.

కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ను ప్రజలు నుంచి మరింత మద్దతు కావాలని కోరారు. మరికొద్ది రోజులపాటు ప్రజలు సహకరిస్తే, వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం వెల్లడించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్‌–95 మాస్కులు, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలు, అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్‌ కిట్స్‌ను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: