తెలంగాణ జీవధార : నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం..!

Friday, June 21, 2019 07:01 AM News
తెలంగాణ జీవధార : నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం..!

తెలంగాణ ప్రజల స్వప్నం నేడు సాకారం కాబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ విశిష్ట అతిథిగానూ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల వద్ద జరిగే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సిఎం కేసిఆర్‌ మేడిగడ్డ బ్యారేజీని, కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్లను ప్రారంభించనున్నారు. ఇదేసమయంలో ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లతో పాటు నంది మేడారం, రామడుగు పంపుహౌస్‌లను రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చే అతిథుల కోసం 16 హెలిప్యాడ్లను అధికారులు సిద్ధంచేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద ఏడు, కన్నెపల్లి పంపు హౌస్‌ వద్ద తొమ్మిది హెలిప్యాడ్లను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ భూభాగంలో 60శాతం భూములకు నీరు మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రెండు దశల్లో మొత్తం 45లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చేలా బ్యారేజీలను నిర్మించారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ. 84 వేల కోట్లు కాగా ఇప్పటికే రూ. 50 వేల కోట్లు ఖర్చు పెట్టారు.

For All Tech Queries Please Click Here..!