మధుమేహానికి వాడే మందులతో ఆయువు పెరుగుతుందట

Friday, October 4, 2019 03:00 PM News
మధుమేహానికి వాడే మందులతో ఆయువు పెరుగుతుందట

మానవులు నిత్యం తీసుకునే మందులు శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంటాయి. కొన్ని మందుల వలన వ్యాధి నయం అయినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే కొన్ని మందులు జీవితకాలాన్ని పెంచుతూ వెళతాయట.. చిత్రంగా ఉన్నా ఇది నిజం.. మధుమేహానికి ఉపయోగించే మందుతో మనిషి యొక్క ఆయుష్షు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో తెలిసింది. 

మధుమేహం వ్యాధి వచ్చినవారు మెట్ ఫార్మిన్ అనే మందును ఎక్కువగా ఉపయోగిస్తారు. మెట్‌ఫార్మిన్‌ మందులతో మనిషి ఆయువు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతరులతో పోలిస్తే మధుమేహంతో ఉన్న వారిలో కేన్సర్‌ తక్కువగా సోకుతుండటం.. ఎక్కువ కాలం జీవిస్తుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కారణాలను శోధించే పనిలో పడ్డారు. 2017లో జరిగిన ఓ పరిశోధన ప్రకారం.. ఈ మార్పుతో మెట్‌ఫార్మిన్‌కు సంబంధం ఉన్నట్లు తెలిసింది.

జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మెట్‌ఫార్మిన్‌ వాటి ఆయువు పెంచినట్లు గుర్తించారు. అయితే ఈ ఫలితాలు ఒకే తీరు ఉండకపోయేవని చెబుతున్నారు. కారణం ఏమిటా.. అని వెతికితే మన కడుపు/పేవుల్లోని బ్యాక్టీరియా విడుదల చేసే అగ్మాటిన్‌ అనే రసాయనం మెట్‌ఫార్మిన్‌ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో తాము మరిన్ని విస్తృత పరిశోధనలు చేయనున్నామని, నమూనాల ఆధారంగా వ్యక్తుల పేగుల్లో ఉండే బ్యాక్టీరియా రకాలను అంచనా వేసి కంప్యూటర్‌ సిమ్యులేషన్లు సిద్ధం చేశామని శాస్త్రవేత్త క్రిస్టోఫ్‌ కలేటా తెలిపారు.

మెట్‌ఫార్మిన్‌ తీసుకుంటున్న వ్యక్తుల్లో ఈ–కొలీ బ్యాక్టీరియా ఉంటే.. నైట్రోజెన్‌ ఎక్కువగా ఉండే రసాయనాలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిసిందని.. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వివరించారు. యేల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఇటీవల ఓ పరిశోధన చేపట్టి మందులపై పేగుల్లోని బ్యాక్టీరియా ప్రభావాన్ని కనుగొన్నారు.

For All Tech Queries Please Click Here..!