కృష్ణా జిల్లాలో ఘోరం... దారుణానికి ఒడిగట్టిన తండ్రి

Wednesday, December 5, 2018 06:05 PM News
కృష్ణా జిల్లాలో ఘోరం... దారుణానికి ఒడిగట్టిన తండ్రి

అందివచ్చిన కొడుకు మంచం పట్టడంతో మనస్తాపానికి లోనైన ఓ తండ్రి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోతే తన కుమారుడికి సపర్యలు చేసేందుకు ఎవ్వరూ ఉండరన్న ఆవేదనతో అతని మెడకు ఉరితాడు బిగించి హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రకాశ్ నగర్‌లో కూల్‌డ్రింక్‌ షాప్‌ వ్యాపారి  సూరాబత్తుల విష్ణుమూర్తి(40)కి విజయలక్ష్మి అనే మహిళతో 23 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి సాయికుమార్‌(22) అనే కుమారుడు, భవాని అనే కూమార్తె ఉన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సాయికుమార్‌ రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. వైద్య పరీక్షలు చేయించగా శరీరంలోని కొన్ని భాగాల్లో రక్తప్రసరణ ఆగిపోయిందని తేలింది. దీంతో దాదాపు రూ.20 లక్షలు ఖర్చుపెట్టి కుమారుడికి వైద్యం చేయించారు. అయినా  ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి లోనైన విష్ణుమూర్తి తాను చనిపోతే కుమారుడికి సపర్యలు చేసేవాళ్లు, వైద్యం చేయించేవాళ్లు ఉండరని విపరీతంగా బాధపడ్డాడు. అనంతరం కొడుక్కి ఉరివేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.