యువకులపై పంజా, దేశంలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిపైనే ప్రతాపం..!

Thursday, April 2, 2020 09:33 AM News
యువకులపై పంజా, దేశంలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిపైనే ప్రతాపం..!

భారత దేశంలో విభిన్నంగా యువకులపై కరోనా పంజా విసురుతోంది. ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల వయసు వారిపైనే తన ప్రతాపం చూపుతోంది అని గణాంకాలు చెప్తున్నాయి. మిగిలిన దేశాలలో ముసలి వారిపైన ప్రభావం చూపిన కరోనా మన దేశంలో యువత పైన ఎక్కువ ప్రభావం చూపటం ఆశ్చర్యమే. దేశంలో కరోనా కేసులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటి వివరాలు ట్రాక్‌ చేస్తున్న ‘కరోనా ట్రాకర్‌’అనే వెబ్‌సైట్‌ పాజిటివ్‌ కేసుల వివరాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,751 కేసులు నమోదు కాగా.. 614 కేసులను విశ్లేషించింది. మిగిలిన కేసులకు సంబంధించిన వయసు, తదితర వివరాలు సమగ్రంగా లేకపోవడంతో 614 కేసులనే విశ్లేషించగలిగింది. (కరోనా :అపోహలూ... వాస్తవాలు)

ఈ కేసుల్లో 20 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు 157 మంది ఉన్నారని తేల్చింది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు 129 మంది ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు 97, 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారు 96 మంది ఉన్నారు. 60 నుంచి 70 మధ్య వయసు వారు 72 మంది ఉన్నారని వెబ్‌సైట్‌ విశ్లేషించింది. అత్యంత తక్కువగా 80 నుంచి 100 ఏళ్ల మధ్య వయసు వారు ఏడుగురు కాగా, 10 ఏళ్లలోపు వారు 15 మంది ఉన్నారు. 70 నుంచి 80 ఏళ్ల వయసు వారు 18 మంది ఉన్నారు. 10 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారు 23 మంది ఉన్నారు. అంటే అత్యంత ఎక్కువగా యుక్త వయస్కులకే కరోనా వ్యాపించిందని వెబ్‌సైట్‌ తెలిపింది. అయితే మరణాలు ఏ వయసు వారిలో ఎక్కువ ఉన్నాయన్న దానిపై విశ్లేషించలేదు. అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం 70 ఏళ్లు దాటినవారే అధికంగా మరణిస్తున్నారని తెలిపింది.

For All Tech Queries Please Click Here..!
Topics: