రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం; కియా మోటార్స్

Tuesday, January 29, 2019 03:04 PM News
రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం; కియా మోటార్స్

కరువు సీమకు మంచి రోజులొచ్చాయి... ఇప్పటి వరకు అనంతపురం అంటే అందరూ జాలిపడ్డారే తప్ప ఈ ప్రాంత అభివృద్ది కోసం ఇసుమంతైనా మంచి చేసిన దాఖలాలు లేవు. సీమలో ఏ ఊరిని పలుకరించినా కరువు కోరల నుండి బయటపడేందుకు పొట్టచేతబట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన రాయలసీమ వాసులు ఆవేదనలున్నాయి. ఈ పరిస్థితులకు ఇక తెరపడనుంది. నేడు కియా మోటార్స్ తమ మొదటి ఉత్పత్తిని లాంచ్ చేయడంతో అనంతపురం ఇప్పుడు ఆటోమొబైల్ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది.  

తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు ఎంతగానో కృషి చేశారు. అందులో భాగంగానే ప్రపంచ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చారు. పారిశ్రామికంగా బాగా అభివృద్ది చెందిన గుజరాత్, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలను కాదనుకొని ప్రపంచ వ్యాప్తంగా తమ 15 కార్ల తయారీ పరిశ్రమ కేంద్రాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నెల్లూరు-చిత్తూరు-చెన్నై కారిడార్, మరియు బెంగళూరు వంటి ప్రదేశాలకు అనంతపురంలోని పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేసిన కియా ప్రొడక్షన్ ప్లాంటు అత్యంత సమీపంగా ఉంటుంది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కియా తొలి కారును లాంచ్ చేశారు. పెనుకొండలోని కియా ప్రొడక్షన్ ప్లాంటులో తయారైన మొట్టమొదటి కారును ట్రయల్ రన్ కోసం లాంఛనంగా ప్రారంభించారు. కియా మోటార్స్ సంస్థకు ఇది ప్రపంచంలోనే 15 తయారీ కేంద్రం. యుద్దప్రాతిపదికన శరవేగంగా ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి అతి తక్కువ వ్యవధిలోనే ప్రొడక్షన్ ప్రారంభించారు. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల కార్లు.

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ 2018లో ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్-పో వాహన ప్రదర్శన వేదికలో తమ నూతన మోడళ్లను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశీయంగా ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్న హ్యుందాయ్ మోటార్స్ కియా మోటార్స్‌కు మాతృ సంస్థ. ఇరు కంపెనీల ఉమ్మడి భాగస్వామ్యంతో కియా పెనుకొండ ప్లాంట్ వేదికగా ఎన్నో కొత్త రకం కార్లు రూపుదిద్దుకోనున్నాయి. అంతే కాకుండా 2025 నుండి ఎలక్ట్రిక్ కార్ల తయారీని కూడా చేపట్టాలని సంస్థ భావిస్తోంది.

13 వేల కోట్ల రుపాయల వ్యయంతో అందుబాటులోకి వచ్చిన కియా ప్లాంటుకు అనుగుణంగా మరో 3000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే మరిన్ని అనుబంధ సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్నట్లు. కియా సంస్థ ద్వారా 4 వేల మందికి ప్రత్యక్షంగానూ... మరో 13 వేల మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

For All Tech Queries Please Click Here..!