నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

Friday, October 25, 2019 04:00 PM News
నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఏపీ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. విభజన తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్కారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నవ నిర్మాణ దీక్షలుగా మార్పు చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం ఏర్పడిన జూన్ 8వ తదీ వరకు నవ నిర్మాణ దీక్షల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఈ సంప్రదాయానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళం పాడారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను నవంబర్ 1వ తేదీని జరపాలని నిర్ణయించారు. గతంలో 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది.

అయితే విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ తేదీని పరిగణనలోకి తీసుకోలేదు. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అక్టోబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పరిగణించాలని కొందరు.,.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నవంబరు 1నే కొనసాగించాలని మరికొందరు, ఆరోజు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు లేనందున అది సరికాదని ఇంకొందరు వాదించారు.

కాగా రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. అయితే చంద్రబాబు సర్కార్ గత ఐదేళ్లూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనే లేదు. దాని స్థానే జూన్‌ 2న నవనిర్మాణ దీక్ష పేరుతో కోట్ల రూపాయలను ప్రచారాలకు వెచ్చించింది.

ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని సర్కార్ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఈ నెల 21న సమావేశాన్ని కూడా ఏర్పాటుచేశారు. పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా, దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు కూడా ఆ విభజన తేదీ రోజునే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

For All Tech Queries Please Click Here..!