దోపిడీ దొంగలు బీభత్సం...ప్రతిఘటించడంతో రైల్లో నుండి తీసివేత

Tuesday, December 18, 2018 02:56 PM Crime
దోపిడీ దొంగలు బీభత్సం...ప్రతిఘటించడంతో రైల్లో నుండి తీసివేత

అనంతపురం జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్‌ సమీపంలో గొల్లపల్లి గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్లో ప్రయాణిస్తున్న దివ్య అనే ప్రయాణికురాలు బాత్రూమ్‌కు వెళ్లి వస్తుండగా బోగీలో అప్పటికే ఉన్న ఇద్దరు దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేశారు. అనంతరం వారు కిందకు దూకి మహిళ మెడలోని నగలు లాక్కెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను సమీప పొలాల్లోని రైతులు గమనించి 108కు సమాచారం అందించారు. ఆమెను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె గర్భిణీ కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. భర్త బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావడంతో ఆమె అత్తగారితో కలిసి బెంగళూరు వెళ్తోంది. దివ్య స్వస్థలం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.