ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లిన డాక్టర్లపై రాళ్లతో దాడి.

Thursday, April 2, 2020 11:00 AM Crime
ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లిన డాక్టర్లపై రాళ్లతో దాడి.

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కరోనా పేషెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు డాక్టర్లపై దాడి చేసిన ఉదంతం మనకి తెలిసిందే. అయితే అలాంటి ఘటనే మరొకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కరోనా పేషెంట్ అనుమానితుడిని ఆసుపత్రికి తరలించడానికి అతని ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై రాళ్ల వర్షాన్ని కురిపించారు అక్కడి స్థానికులు. రాళ్లతో దాడి చేసి వారిని తరిమి కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే ఇండోర్‌లోని భాకల్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చారు. కరోనా పేషెంట్ అనే ముద్ర వేస్తారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఇండోర్ వైద్యాధికారులు అతని పేరు, చిరునామా, ఫోన్ నంబర్లను ఢిల్లీ పోలీసుల నుంచి సేకరించి ఆ సమాచారం మేరకు అతనికి వైద్య పరీక్షలను నిర్వహించడానికి ఆసుపత్రికి రావాలని ఫోన్ ద్వారా సూచించారు. దీన్ని అతను పెడచెవిన పెట్టాడు. దీనితో వైద్యాధికారులు అతని ఇంటికి అంబులెన్స్‌ను పంపించారు. ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బంది అతని ఇంటికి వెళ్లగా వైద్య పరీక్షలకు నిరాకరించాడు. ఈ విషయాన్ని తన వీధిలో వారందరికీ తెలియజేశాడు. దీనితో సుమారు 50 మంది అతని ఇంటికి చేరుకొని డాక్టర్లతో గొడవ పడ్డారు. వారితో ఘర్షణకు దిగి తరిమి కొట్టారు. చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. ఈ ఘటనపై ఇండోర్ జిల్లా వైద్యాధికారులు ఛత్రిపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్ల ప్రాణాలను నిలపడానికి తాము రేయింబవళ్లు శ్రమిస్తున్నామని, డాక్టర్లపై దాడి చేయడం సరికాదని చెప్పారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: